మోత్కూరులో భారీ అగ్నిప్రమాదం
వస్త్రాల దుకాణంలో దసరా మాల్ దగ్ధం
ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ
కోటి వరకు వస్త్రాలు దగ్ధం అయినట్లు సమాచారం
యాదాద్రి,సెప్టెంబర్18(జనంసాక్షి): యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ కృష్ణా వస్త్ర దుకాణంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రూ. కోటిన్నర విలువైన వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే ఇది సరిపోకపోవడంతో రామన్నపేట నుంచి మరో అగ్నిమాపక యంత్రాన్ని రప్పించారు. రెండు యంత్రాల సాయంతో ఆరు ట్యాంకర్ల నీటితో మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్నిమాపకాధికారి యజ్ఞ నారాయణ, యాదాద్రి జిల్లా అదనపు అధికారి అశోక్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణమని అధికారులు గుర్తించారు. దసరా కోసం తెచ్చిన సరకును సర్దిన కాసేపటికే… అగ్ని ప్రమాదం జరిగినట్లు యజమానులు తెలిపారు.కాలిబూడిదైన బట్టలు, సుమారుగా కోటి ఆస్తి నష్టం జరిగింది.దసరా పండగ కోసం తెచ్చిన కొత్త స్టాక్ ను ప్యాక్ చేసేందుకు అర్థరాత్రి 12 గంటల వరకు సిబ్బంది పని చేసి వెళ్లిపోయారు. సరిగ్గా అర్థరాత్రి ఒంటిగంటకు షాప్ లో ఒక్కసారిగా మంటలు
చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.