మోదీ అబద్ధాలు ఆపు.. ` సూర్యుడు సిగ్గుపడుతున్నాడు:ఖర్గే
దిల్లీ(జనంసాక్షి): అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన’ పథకంపై కాంగ్రెస్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.ప్రధాని మాటల గారడీ.. సూర్యుడ్ని తాకిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా కనీసం 10 లక్షల ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటుచేయలేని ప్రభుత్వం.. కోటి ఇళ్లకు సౌర విద్యుత్తు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు భాజపా వేసిన ఎత్తుగడేనని ఆరోపించారు.’’సోలార్ రూఫ్‌టాప్‌ల ద్వారా 2022 నాటికి 40 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని గతంలో గొప్పలు చెప్పిన కేంద్రం పూర్తిగా విఫలమైంది. కేవలం 2.2 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికే పరిమితమైపోయింది. కొన్ని ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటుచేసినా, స్థాపిత సామర్థ్యంలో కేవలం ఐదో వంతు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ విషయంలో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన మోదీ.. తాజాగా సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. 2026 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అంటున్నారు. ఎలాంటి కొత్త నిధులు మంజూరుచేయకుండా ఇది సాధ్యమయ్యే పనేనా? ఎన్నికలు వస్తున్నాయంటే.. మోదీ మాటల గారడీకి సమయం వచ్చినట్లే’’ అని ఖర్గే విమర్శించారు.దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో మోదీ సోమవారం ‘ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్యవంశ భగవాన్ శ్రీరాముడి కాంతి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎల్లప్పుడూ శక్తిని పొందుతుంటారని, దేశంలోని ప్రజలంతా వారి ఇళ్ల కప్పులపై సొంత సౌర ఫలకాల వ్యవస్థ కలిగిఉండాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఎక్స్ వేదికగా వెల్లడిరచారు. సౌరశక్తిని వినియోగించుకోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్తు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు.