మోసంతోనే పద్దెనిమిదేళ్లు గెలిచావ్
– మెడికల్ కళాశాల కోసం జగ్గారెడ్డివి బూటకపు దీక్షలు
– పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి, మే30(జనం సాక్షి) : మెడికల్ కళాశాల మంజూరుకు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజల్ని మోసం చేసి 18 సంవత్సరాలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడని జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు.జగ్గారెడ్డి ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాలనా కాలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు ఇలాంటి మోసగాడికి మద్దతు తెలపడం బాధాకరమన్నారు. మెడికల్ కళాశాల కోసం బూటకపు దీక్షలు చేస్తున్న జగ్గారెడ్డిని ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కళాశాల ఏర్పాటును కోరుతూ 2013లో చేసిన దరఖాస్తును.. మంజూరు అయినట్లు మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కడతారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.