మోసపూరిత ప్రకటనలతో ప్రజలకు వంచన: కాంగ్రెస్
మెదక్,నవంబర్7(జనంసాక్షి): నోట్ల రద్దుతో అచ్చేదిన్ అంటూ ప్రధాని మోడీ, బంగారు తెలంగాణ అంటూ సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని పిసిసి అధికార ప్రతనిధి, మాజీ ఎమ్మెల్యే ఎ.వశిధర్ రెడ్డి అన్నారు. అచ్చేదిన్ అంటే నిత్యావసర ధరలు పెంచడమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం నిత్యం వినియోగించే ఉల్లిపాయల ధర కిలోకి రూ.50, టమాట రూ.50 పలుకుతోందని పేర్కొన్నారు. గృహవినియోగ సిలెండరు ధర రూ.850కి పెరిగిందన్నారు. పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు. పెరిగిన ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కాలంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, కల్లబొల్లి మాటలు, సర్వేలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రజలకు మేలుచేయవని రుజువయ్యిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయాలని, అందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి కష్టపడాలన్నారు.