మ్యారేజ్ సర్టిపికెట్ కావాలా..ఓ మొక్క నాటాల్సిందే
ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లిమ్‌కు సర్వత్రా ప్రశంసలు
ములుగు,జూలై31(జనం సాక్షి): హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటే విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా చైతన్యం వస్తోంది. గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమాలతో ప్రముఖులు మొక్కలు నాటుతూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. యువత కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తాజాగా సరికొత్త ఛాలెంజ్ ఒకటి ప్రజల ముందుకు వచ్చింది. నూతన వధూవరులు తప్పనిసరిగా మొక్కలు నాటాలని, మ్యారేజ్ రిజిస్టేష్రన్‌కు వచ్చే వారు ఇందుకు సిద్దపడాలని ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లిమ్‌మహమ్మద్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. నూతనంగా వివాహం చేసుకున్న వధూవరులు వారి అవసరాల కోసం మ్యారేజీ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకుని పొందాలంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా నూతన వధూవరులు విధిగా ఒక మొక్కను నాటాలని ఆమె అన్నారు. ఇక నుంచి మ్యారేజీ సర్టిఫికెట్ కోసం తమ కార్యాలయానికి వచ్చే వధూవరులకు హరితహారంలో భాగంగా విధిగా ఒక మొక్కను అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో హరితస్ఫూర్తిని పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఇటీవల మ్యారేజీ సర్టిఫికెట్ పొందిన డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన నూతన వధూవరులకు కలెక్టర్ అమయ్‌కుమార్ చేతుల విూదుగా వధువుకు మొక్కను, వరునికి మ్యారేజీ సర్టిఫికెట్‌ను అందించారు. ప్రభుత్వం అప్పగించిన
బా ధ్యతలను నిష్కల్మషంగా నిర్వహిస్తూ కార్యాలయానికి వస్తున్న ప్రజల మదిలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంటూ నూతన వధూవరులతో మొక్కను నాటించాలనే ఆలోచన చేసిన సబ్‌రిజిస్ట్రాన్‌ను కలెక్టర్ అభినందనందించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆమె స్ఫూర్తిని అభినందిస్తున్నారు.