యాదాద్రిలో కార్తీక శోభ

సత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక

యాదాద్రి భువనగిరి,నవండర్‌23(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి నరసింహుడి జన్మనక్షత్రం స్వాతిరోజు నుంచే కార్తీకమాసం వేడుకలు మొదలయ్యాయి. పౌర్ణమి కావడంతో వేదమంత్ర పఠనాల మధ్య ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించే పూజారులు గర్భాలయంలోని స్వయంభువులకు కూడా అభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు అధికంగా కొనసాగాయి. శ్రీ నారసింహుడిని దర్శించిన భక్తులకు శివాలయ సందర్శన కలగడం మరో విశేషం. అన్నవరం ఆలయం తరువాత ఇక్కడే వ్రతాలు అధిక సంఖ్యలో కొనసాగుతాయి. ఆ విశిష్టతగల యాదాద్రిలో రోజూ నాలుగుమార్లు కొనసాగుతున్న ఆ పూజల సదుపాయాన్ని కార్తీకమాసంలో ఆరుదఫాలుగా నిర్వహించేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది. ఆలయ సందర్శన, వ్రతాల నిర్వహణ కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కార్తీక మాసంలో ఆలయాలను సందర్శించి వ్రతాలు నిర్వహించడం శుభదాయకమని పండితులు, పూజారులు చెబుతున్నారు. ఆలయ విస్తరణ పర్వంలోనూ గతంలో కొనసాగిన మండపాలలోనే వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు.