యాదాద్రి అభివృద్దికి సంకల్పం
కూటమి నేతలకు ఎన్నికల్లో భంగపాటు తప్పదు: సునీత
యాదాద్రి భువనగిరి,అక్టోబర్13(జనంసాక్షి): ముఖ్యమంత్రి ఆశిస్సులు యాదాద్రికి సంపూర్ణంగా ఉన్నాయని, ఆయన సహకరాంతో ఈ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకుంటున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందని అన్నారు. ఇప్పటికే పనులు శరవేంగగా జరుగుతున్నాయని అన్నారు. ఓ వైపు జిల్లా
ఏర్పాటు,మరోవైపు యాదాద్రి ఆలయ అభివృద్ది అన్నది తమ పూర్వ జన్మ సుకృతమన్నారు. ఇది సిఎంగా కెసిఆర్ తమకిచ్చిన వరంగానే భావిస్తున్నామని అన్నారు. ఆలేరులో అభివృద్ది జరిగిందనడానికి ఇదొక్కటి చాలన్నారు. కెసిఆర్ లేకుంటే ఇవి జరిగేవికావన్నారు. పరిపాలన సౌలభ్యత, ప్రజల అవసరాల కోసమే కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు జరిగిందన్నారు. ప్రజలకు పూర్తి సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశారని అన్నారు.గతంలో ఏనాడయినా ఇంతటి నిర్ణయం జరగ్గా చూశామా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్త కార్యాలయాలు కూడా అందుబాటులోకి వచ్చేలా శంకుస్థాపనలు చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల విభజనతో ప్రజల చెంతకు పాలన వచ్చిందని ఎమ్మెల్యే కొనియాడారు. జిల్లాల ఏర్పాటు తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టమని ఆమె అభివర్ణించారు. ఉద్యమ నాయకుడే సీఎం కావడంతో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిల్చిందన్నారు. ఒకపక్క ఉద్యమానికి రూపకల్పన చేస్తూనే సాధించుకున్న రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అనుభవం లేని మంత్రులు, ఎమ్మెల్యేలతో రాష్ట్రం అభివృద్ధి చెందదని అవాకులు చెవాకులు పేలిన ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా సీఎం పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేవలం నాలుగేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగటాన నిలిపాని పేర్కొన్నారు. దశాబ్దాలుగా రెవెన్యూ విభాగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. అభివృద్ది చేసిన టిఆర్‌ఎస్‌నే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని, కేటమి నేతలకు భంగపాటు తప్పదన్నారు.