యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం
వలిగొండ(జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మూసీ కాలువలో బోల్తా పడటంతో 15 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వేముల కొండ చెరువు పక్కన పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వ్యవసాయ కూలీలు ట్రాక్టర్‌లో బయలుదేరారు. చెరువు కట్టపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి మూసీ కాలువలోకి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రామన్నగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.