యాసంగి పంటకు నీటి విడుదల

– నాగర్జునసాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌

నాగార్జున సాగర్‌,డిసెంబర్‌ 10,(జనంసాక్షి): మంత్రి హరీశ్‌ రావు ఇవాళ నాగార్జున సాగర్‌ను సందర్శించారు. నాగార్జున సాగర్‌ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్‌ నుంచి ఎడమ కాలువకు నీటిని మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్‌ రెడ్డి విడుదల చేశారు. యాసంగి పంట కోసం నీటిని మంత్రులు విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… తమది అభివృద్ధి దాహమైతే.. కాంగ్రెస్‌ది అధికార దాహమన్నారు. యాసంగి కోసమే సాగర్‌ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగర్‌ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.యాసంగి పంట కోసం తొలి విడత నీరు విడుదల చేశామన్న మంత్రి.. 2018 ఏప్రిల్‌ 5 నాటికి చివరి విడత నీరు విడుదల చేస్తామని హావిూ ఇచ్చారు. నీరు వృధా కాకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. సాగర్‌ వద్ద లిఫ్ట్‌లన్నీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసుకున్నామని మంత్రి తెలిపారు.కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌ ఆధునికీకరణ పనులు 30 శాతమే జరిగాయని.. తాము మూడేండ్లలోనే 65 శాతం సాగర్‌ ఆధునికీకరణ పనులు చేశామని హరీశ్‌ రావు గుర్తు చేశారు. సాగర్‌ ఎడమ కాల్వ ఆధునికీకరణ కోసం రూ. 1265 కోట్లు వెచ్చించామని మంత్రి వెల్లడించారు. 2018 జూన్‌ నాటికి వంద శాతం పనులు పూర్తి చేసామని మంత్రి హావిూ ఇచ్చారు.సాగునీటి పారుదల శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని… సాగర్‌ పనుల తీరుపై ప్రపంచ బ్యాంకు మనల్ని అభినందించిందన్నారు. అధికారులంతా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి చెప్పారు. యాసంగి సాగు పూర్తి అయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని.. రైతులు పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవాలని మంత్రి కోరారు.అధికారం కోసం కాంగ్రెస్‌ రాజకీయ పునరేకీకరణ అవసరం అంటున్నదని… సిద్ధాంతాలు పక్కనపెట్టి విపక్షాలు అధికారం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కోర్టుల్లో కేసులతో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.మిషన్‌ కాకతీయ, భగీరథ, విద్యుత్‌ రంగంపై ప్రశంసలు కురుస్తున్నాయని మంత్రి వివరించారు. 24 గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలిగే స్థాయికి మనం చేరుకున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

తాజావార్తలు