యుద్దప్రాతిపదికన పనులను పూర్తి చేయండి

– రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోండి
– కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయండి
– ఇరిగేషన్‌ అధికారులతో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమీక్ష
జనంసాక్షి, మంథని : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మానేరు నది ఉప్పొంగి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రాజగృహాలో ఇరిగేషన్‌ ఈఈ బలరామయ్య, డీఈ రమేష్‌ బాబులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు నదిలో చెక్‌ డ్యాం నిర్మాణం చేపట్టిన క్రమంలో వరద ముంపుతో చెక్‌డ్యాం కొట్టుకు పోయిందని, మానేరు వరదతో రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, అనేక భూములు కోతకు గురయ్యాయని ఆయన అన్నారు. ఒక గొప్ప ఆలోచనతో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చెక్‌ డ్యాం నిర్మాణం చేపట్టితే ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రైతులు నష్టపోకుండా ఇసుక మేటలు తొలగింపు, కోతకు గురైన ప్రాంతాల్లో మట్టితో నింపాలని ఆయన సూచించారు. వరద ముంపుతో నష్టపోయిన రైతులకు అండగా నిలువాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ క్రమంలో అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మానేరు నది ప్రాంతంలో కరకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆయన ఆదేశించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, చెక్‌డ్యాం పనులతో పాటు రైతులకు ఉపయోగపడే విధంగా పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తాజావార్తలు