యుద్ధ వ్యూహం….

గుడ్లురిమిన కొద్దీ…
గడ్డకట్టుకుపోతావు

తరిమిన కొద్దీ…
పరుగు పెడుతావు

అణిచివేసిన కొద్దీ…

వాడి  ఆధిపత్య పోకడకు
వంగి “సలామ్” చేస్తావు

విష కుట్రల “వల”కు చిక్కి
రాజ్యం కట్టబెడతావు

ఎప్పుడు ఎదురు ప్రశ్నించావనీ…
వాడు “జవాబు”దారీ అవుతాడు?

ఎన్నడు నిక్కచ్చిగా నిలబడ్డావనీ…
వాడు “తల”దించి మోకరిల్లుతాడు?

కట్టు బానిసవై…
ఎన్నాళ్లు “ఊడిగం” చేస్తావు?

పిరికివాడిలా…
ఇంకెన్నేళ్ళు “చస్తూ” బతుకుతావు?

ఇప్పటికైనా….
మెదడుకు “పదును” పెట్టి
యుద్ధ “వ్యూహాల” రచించు
ఎత్తుగడల “గోడల” నిర్మించు

నరనరాల్లో “రక్తం” మరిగించు
కణకణాల్లో “సెగలు” రగిలించు

పోరాడితే మిగిలేదే తప్పా!
పోయేదేమి లేదని గ్రహించు

గుండె నిండా “తెగువ” దట్టించి
అలుపెరుగని “పోరు” సాగించు

శత్రువు ఎంతటి వాడైనా…
యుద్ధం ఎంత భీకరమైనా…

ఓటమి నీ “పాదం” కింద నిర్జీవం
గెలుపు నీ “మీసం” మీద సజీవం

            “”””””””””””””””””
కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
సెల్ నం: 9573929493