యూత్‌ను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్
సోషల్ విూడియాతో ప్రభావితులవుతున్న ప్రజలు
పోటాపోటీగా మొక్కలు నాటుతున్న ప్రముఖులు
హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): గ్రామస్థాయిలో ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. ఎవరికి వారు చాలెంజ్ విసురుతున్నారు. దమ్ముంటే ఓ మొక్క నాటి చూపు అని సవాళ్లు విసరుకుంటున్నారు. విఐపిల స్థాయి నుంచి యూత్, స్టూడెంట్స్ స్థాయికి ఇది చేరింది. అతి తక్కువ సమయంలో ప్రజల్లోకి వెళ్లిన ‘గ్రీన్ ఛాలెంజ్’ దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే ఎంపిలు, మంత్రులు,సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ కింద మొక్కలు నాటి మరో ముగ్గురితో నాటించేలా చేస్తున్నారు. దీంతో దీనికి ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. సోషల్ విూడియా కూడా తోడు కావడంతో యువకుల్లో ఉత్సాహం నింపుతోంది. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడు విడతలు విజయవంతంగా పూర్తి చేసుకొని, నాలుగో విడత హరిత హారంలో కోట్లాది మొక్కలు నాటాలన్న సంకల్పంతో దూసుకెళ్తోంది. మొక్కల పెంపకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహస్తున్నాయి. మొదటగా హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటి, విూరూ మొక్కలు నాటాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన కవిత మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మరో నలుగురు ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ దర్శకుడు రాజమౌళికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు. మొక్కలు నాటే కార్యక్రమం పోటీతత్వంతో సాగేలా చేయడం గ్రీన్ చాలెంజ్ ఉద్దేశ్యం. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, వాతావరణ మార్పులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపి కవిత అభిప్రాయపడ్డారు. ఎంపీ కవిత విసిరిన సవాల్‌ను స్వీకరించిన సైనా నెహ్వాల్, రాజమౌళి మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ కవితకు సైనా నెహ్వాల్ కృతజ్ఞతలు తెలిపారు. తన స్నేహితులు తాప్సీ, శ్రద్దాకపూర్, ఇషా గుప్తాలకు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. పు/-లలెల గోపీచంద్, మంత్రి కేటీఆర్, యువ దర్శకులు సందీప్, నాగ్ అశ్విన్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా రాజమౌళి ట్విటర్లో కోరారు. /రిక్కలు నాటాలనే ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ సవాల్ స్వీకరించి హరితహారంలో భాగంగా పద్మశ్రీ వనజీవి రామయ్య నల్గొండలోని ఓ గోశాలలో మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జోగు రామన్నలకు ఈ ఛాలెంజ్ చేశారు. రామయ్య సవాల్ ను స్వీకరించి మంత్రి జోగు రామన్న మొక్కలు నాటారు. తర్వాత మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, శాసన సభ స్పీకర్ మదుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాలని సవాల్ చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులే కాదు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో సామాన్యులూ ముందున్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ, సెల్ఫీ తీసుకుంటూ, విూరూ మొక్కలు నాటాలని వారి మిత్రులకు సవాల్ విసురుతున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ గ్రీన్ ఛాలెంజ్ ప్రస్తావనే కనపడుతోంది. గ్రీన్ ఛాలెంజ్‌తో హరితహారం కార్యక్రమంపై విస్తృత ప్రచారం కలుగుతోంది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్య స్ఫూర్తిని రగిలిస్తోంది.