యూపీలో రాష్ట్రపతి పాలన?

999

– అఖిలేష్‌ గవర్నర్‌తో భేటీపై పలు ఊహాగానాలు

లక్నో,అక్టోబర్‌ 26(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు నిముషనిముషానికి  వేడెక్కుతున్నాయి. తండ్రీకొడుకులు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు నడుపుతున్నారు.  ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ నివాసంలో బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అఖిలేశ్‌ యాదవ్‌ చేపట్టనున్న రథయాత్రపై ఎస్పీ నేతలు చర్చించినట్లు సమాచారం. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్పీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అఖిలేశ్‌యాదవ్‌  రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే అటు ప్రభుత్వంలో.. ఇటు సమాజ్‌వాదీ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అఖిలేష్‌ యాదవ్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ తో అఖిలేష్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. అంతకు ముందు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో అఖిలేష్‌ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.  ఇదంతా  అఖిలేష్‌ సన్నిహితుడు, మంత్రి పవన్‌ పాండేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌ ప్రకటించిన తరవాతనే జరిగింది. తండ్రిని, బాబాయ్‌ను కట్టడి చేయాలంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అఖిలేశ్‌ నిర్ణయించారని పురకార్లు బయలు దేరాయి. ఆపద్దర్మ సిఎంగా ఉండి రాజకీయాలు నడపాలని అఖిలేష్‌ ప్లాన్‌ వేసినట్లు సమాచారం.  గత కొద్ది రోజుల నుంచి శివపాల్‌, అఖిలేష్‌ మధ్య గొడవలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అఖిలేశ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి తేజ్‌ నరైన్‌ పాండే అలియాస్‌ పవన్‌ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆయనపై పార్టీ ఆరేళ్ల పాటు వేటు వేసిందని రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌ వెల్లడించారు. పార్టీ సమావేశంలో పవన్‌ పాండే ఎస్పీ ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయనపై చేయి చేసుకున్నాడని తెలిపారు. అమర్యాదకరంగా ప్రవర్తించినందుకుగాను సమాజ్‌వాదీ పార్టీ నుంచి పవన్‌ పాండేను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో శివపాల్‌ ప్రకటించారు.  విషయాన్ని సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు శివపాల్‌ లేఖ ద్వారా తెలిపారు. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చిన పవన్‌ పాండే దాడి చేశారని, రెండు సార్లు చెయ్యి చేసుకున్నారని ఎమ్మెల్సీ ఆశుమాలిక్‌ వెల్లడించారు. ఆ ఘటన జరిగిన సమయంలో సీఎం అఖిలేశ్‌ ఇంట్లో లేరని తెలిపారు. దీనిపై రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని అన్నారు. ఎస్పీలో,కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ములాయం ప్రకటించిన మరునాడే ఈ పరిణామాఉల చోటుచేఉకోవడంతో ఇవి ఎటుదారితీస్తాయో అని భావిస్తున్నారు.