యూపీలో సత్తా చాటాలి

4

– 600 కిమీ ప్రచార యాత్రను జెండా ఊపి ప్రారంభించిన సోనియా

లక్నో,జులై 23(జనంసాక్షి): యూపి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికేరాజ్‌బ్బ్ర్‌ను రంగంలోకి దింపారు. పార్టీ సిఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ పేరును ప్రకటించారు.  రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే సర్వశక్తులొడ్డుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మార్గనిర్దేశంలో ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా లక్నో నుంచి కాన్పూర్‌ వరకు 600 కిలోవిూటర్ల బస్సుయాత్రను ప్రారంభించింది. యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ తదితర సీనియర్‌ నేతలు పాల్గొనే ఈ బస్సుయాత్రను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం జెండాలు ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్‌తో జతకట్టి.. వారికి ఎన్నికల విజయాలు అందించిన ప్రశాంత్‌ కిషోర్‌.. యూపీ, పంజాబ్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చేతలు కలిపిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా యూపీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రచార నినాదాన్ని ఖరారు చేశారు.  27 సాల్‌.. యూపీ బెహాల్‌ (27 ఏళ్లు యూపీని నాశనం చేశారు) అనే నినాదంతో హస్తం ప్రజల్లోకి వెళ్లనుంది. యూపీలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన గత 27 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని కాంగ్రెస్‌ ప్రచారం చేయనుంది. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిపైనా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆగస్టు 2న వారణాసిలో సానియాగాంధీ భారీ రోడ్డుషో చేపట్టే అవకాశముంది. ఇక రాహుల్‌గాంధీ వచ్చేవారం లక్నోలో 50వేలమంది పార్టీ కార్యకర్తలతో సదస్సు నిర్వహించనున్నారు. బీజేపీకి ఉన్న వ్యవస్థీకృత కార్యకర్తల బలం వల్లే ఆ పార్టీ విజయాలు సాధిస్తున్నదని గ్రహించిన కాంగ్రెస్‌ తన కార్యకర్తలను కూడా వ్యవస్థీకరించుకొని..కట్టుదిట్టంగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. దీంతో ఓటు రీత్యా బలంగా ఉన్న బ్రాహ్మణవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇక సిఎం అభ్యర్థిగా ఉన్న షీలా దీక్షిత్‌ బ్రాహ్మణవర్గానికి చెందిన వారు కావడంతో ఆమె తనదైనరీతిలో సాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడనున్నారు.