రంగారెడ్డి: పూజారి ఆత్మహత్యాయత్నం

తాండూరు: ధూప దీప నైవేద్యాలు పట్టించుకోని మీరు మాపై పెత్తనం చేయడమేమిటని ప్రశ్నించిన పూజారిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బూతులు తిట్టడంతో పూజారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. పట్టణంలోని నగరేశ్వర దేవాలయం ఎండోమెంట్‌ పరిధిలో ఉంది. ఈ దేవాలయంలో ఎండోమెంట్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా సేవలు అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా దామోదర్‌ పూజారిగా సేవలందిస్తున్నారు. శనివారం సాయంత్రం నగరేశ్వర దేవాలయంలో ప్రతిరోజు మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నారు. తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ముదెళ్ళి అశోక్‌తో పాటు సలహా సంఘం సభ్యులు శేకపురం రమేష్‌ దేవాలయానికి వచ్చారు. వచ్చిరాగానే పూజారి దామోదర్‌పై ఏంచేస్తున్నావ్‌… సరిగా పూజలు చేయడం లేదు. నీ స్వంత సామాన్లు ఇక్కడ పెడితే ఎలా అంటూ రమేష్‌ దామోదర్‌ను పరుష పద జాలంతో దూషించారు. ఎండోమెంట్‌ వారు చెపితే సామాన్లు తీస్తానని దామోదర్‌ బదులివ్వడంతో మరింత రెచ్చిపోయిన రమేష్‌ పత్రికలో రాయలేని భాషతో పచ్చిబూతులు తిట్టారు. దీంతో మనస్థాపానికి గురైన దామోదర్‌ విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చేరుకుని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా స్థానికులు నివారించారు. ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంఘంలోని ఒక వర్గం ఖండించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.