రంగు మురుతోంది!

– సరికొత్త రంగుల్లో మెరవనున్న రైల్వే బోగీలు
– ముదురు నీలం నుంచి గోధుమ రంగులోకి..
న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : త్వరలో రైల్వే బోగీలు కొత్త రంగును సంతరించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ముదురు నీలం రంగులో కనిపించిన కోచ్‌లకు మెరుగులద్దుతున్నారు. లేత గోధుమ, గోధుమ రంగుల్లో అవి ఇక మెరవనున్నాయి. ఢిల్లీ-పఠాన్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని 16 బోగీలకు కొత్త రంగులను వేస్తున్నారు. ఈ రైలు ఈ నెల చివరినాటికి పట్టాలెక్కనుంది. దాదాపు 30 వేల బోగీలకు ఈ కొత్త రంగులు వేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే అన్ని రైళ్ల రంగులను మార్చడం లేదు. రాజధాని, శతాబ్ది, దురంతో, ఇతర ప్రత్యేక సర్వీసులకు ఈ కొత్త రంగుల పథకాన్ని అమలు చేయడం లేదని రైల్వే అధికారులు తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల కోచ్‌లకు మాత్రమే ఈ కొత్త రంగులను వేయనున్నారు. ‘కోచ్‌లకు కొత్త రూపు తీసుకురావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. రైల్వే శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ అనుమతి లభించిన అనంతరం ఈ కొత్త రంగుల పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రైలు బోగీల రంగులను మారుస్తున్నారు. అప్పట్లో ఇటుక ఎరుపు రంగులో బోగీలు ఉంటే వాటికి ముదురు నీలం రంగు వేశారు. మరోవైపు కేవలం రంగులనే కాకుండా బోగీల్లో ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులను అందించడానికి రైల్వే శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా బయో టాయిలెట్లు, సౌకర్యవంతమైన సీట్లు, ప్రతి బెర్త్‌కు మొబైల్‌ ఛార్జర్లు అందించే పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది.