రక్షకభటుల్లో… సేవా కోణం..!

వేమనపల్లి, నవంబర్09,(జనంసాక్షి):
నిత్యం లాఠీలు,తుపాకులు చేత పట్టుకొని డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు పలుగు, పార పట్టారు..టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే పోలీసులు ప్రజల చుట్టాలైపోయారు. ఖాకీలు పల్లె గోసకు కరుణతో కరిగిపోయారు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల‌ జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు ఒడ్డుగూడెం బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో గ్రామస్తులు నాటు పడవల ద్వారా ప్రయాణం కొనసాగించేవారు. ఇటీవల నీటి ప్రవాహం తగ్గడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వాయి ఎస్ఐ గోపతి నరేష్  ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారు …ప్రమాదాలను కొంతైనా నివారించాలని భావించిన ఎస్సై నరేష్ తన సిబ్బందితో కలిసి జేసీబి, ట్రాక్టర్ ల సహాయంతో తాత్కాలిక మట్టిరోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల ప్రయాణ సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు గ్రామలకు, పట్టణాలకు వెళ్లే వారి గమ్యం సుఖ ప్రయాణం కావాలనే ఉదేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని తెలిపారు. ఒడ్డుగూడెం, సుంపుటం, జాజులపేట, ముక్కిడిగూడెం, కళ్లెంపల్లి గ్రామస్తులు, వాహనదారులు ఈ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు. శభాష్‌ పోలీస్ అంటూ అభినందనలు తెలిపారు.