రక్షణ, ఆర్థిక అంశాలపై మోదీ తో చ‌ర్చించిన‌-సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని 24 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నాం. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత మూడేళ్లలో రూ.1,050 కోట్ల వ్యయంతో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల 356 గోడౌన్లు నిర్మించాం. రాష్ర్టాల అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు ఎక్కువ నిధులు ఇవ్వలేని పక్షంలో పన్ను రాయితీలు కల్పించాలి. వ్యవసాయంతో పాటు అనుబంద రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలి. ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలి.
రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యల్లో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలని కేసీఆర్ కోరారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై కేంద్రం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం, నగరీకరణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛనివ్వాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ సూచించారు.