రణరంగంగా… సిరిసిల్ల..
కరీంనగర్ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. విజయమ్మ కాన్వాయి సిరిసిల్లలోకి ప్రవేశించేటపుడు ఒక్కసారిగా తెలంగాణవాదులు రోడ్డుపైకి దూసుకువచ్చి అడ్డుకున్నారు. మహిళలు చెప్పులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కానీ విజయమ్మ కాన్వాయి నుండి దిగిన వందలాది మంది పోలీసులు, సీమాంధ్ర నుండి వచ్చిన గూండాలు వారిని లాగేసి కాన్వాయిని ముందుకు కదిలించారు. ఇలా తీవ్ర నిరసనల మద్యే దీక్షా శిబిరానికి విజయమ్మ చేరుకుంది. ఆమె వేదికపై ఉన్న సమయంలోనే తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సభావేదికపై చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. దీంతో రెచ్చిపోయిన వైయస్సార్ సీపీ కార్యకర్తలు, పోలీసులు కలిసికట్టుగా తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లుగా చితకబాదారు. దీక్షా వద్ద ఆందోళన చేస్తున్న మహిళలపై విజయమ్మ వెంట వచ్చిన సీమాంధ్ర రౌడీలు దాడిచేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు తెలంగాణవాదులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ తెలంగాణవాదులు తరలివస్తుండడంతో అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. చివరికి ఎలాగోలా అయిందనిపించిన విజయమ్మ కేవలం రెండు గంటల్లోనే తిరుగు టపాకట్టింది.