రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్‌ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి నిరాహారదీక్షను విరమించారు. దీక్ష విరమిస్తూ బాబా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్సేనని దాని అంతు చుద్దామని ఆయన పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ను పారద్రోలండి – దేశాన్ని రక్షించండంటూ తన మద్ధతుదారులకు పిలుపునిచ్చారు. రేపు జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి అవినీతి నల్లధనంపై మాట్లాడకపోతే యావత్‌ భారత జాతి సిగ్గుతో తలదించుకుంటుందని ఆయన అన్నారు. తాము స్టేడియం వదిలిపెడుతున్నాం, ఒక విధంగా విజయాన్ని సాధించామనే భావిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా వుండగా యోగాగురువు దీక్ష విరమిస్తున్న సందర్భంగా ప్రముఖ లాయర్‌ రామ్‌జఠ్మాలనీ దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కేంద్రంలోని మంత్రులు, రాహుల్‌ గాంధీకి విదేశీ బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా ఖాతాలు ఉన్నాయని దీక్షాశిబిరంలో ప్రసంగిస్తూ రామ్‌జఠ్మాలనీ ఆరోపించారు. దేశప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇప్పుడున్న కేంద్ర మంత్రులందరూ రాబోయే కాలంలో జైళ్ళలో ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా రాందేవ్‌ బాబా దీక్ష సందర్భంగా పోలీసులు ఈ సారి ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన దీక్షల సందర్భంగా పోలీసుల లాఠీచార్జీలో పలువురు గాయపడిన విషయం తెలిసినదే. గత అనుభవాన్ని దృష్టి పెట్టుకుని ఈ సారి పోలీసులు పకడ్బంధీవ్యూహంతో వ్యవహరించారు. దీక్ష విరమించిన బాబాను పోలీస్‌ ఎస్కార్డ్‌తో ఎయిర్‌పోర్టుకు తరలించారు. గత ఐదు రోజుల నుంచి అన్నపానాలు, స్నానాలు లేకుండా దీక్ష చేస్తున్న రాందేవ్‌ బాబా హరిద్వార్‌కు వెళ్లి గంగలో స్నానం చేస్తానని వెల్లడించారు. కాగా, దీక్షలో పాల్గొన్న బాబాపై ప్రభుత్వం ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు యోగాశ్రమ ఫైనాన్షియల్‌ వ్యవహారాల, టాక్సీ చెల్లింపుల ఫైళ్ళ బూజు దులుపుతుంది.