రాంమోహన్‌రావు ను గెలిపించాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): తెరాస తరఫునపోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు కూడబెట్టి డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. అధికార, డబ్బు బలంతో తెరాస నాయకులు, మంత్రులు ఓటర్లను మభ్యపెడుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు 10వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేయిస్తున్నానని బుకాయించారని తెలిపారు. పట్టభద్రులు అభ్యర్థుల పనితనాన్ని గ్రహించి ఎన్నుకోవాలని సూచించారు.  తెరాస ప్రభుత్వం అవినీతి పరులకు అశ్రయం కల్పిస్తుందని ఎద్దేవా చేశారు. పట్టభద్రులు తమ దూర దృష్టితో ఆలోచించి సమర్థుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలని తెదేపా బలపర్చిన వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావును గెలిపించాలని  పేర్కొన్నారు. అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.