రాజకీయాల్లో మార్పు తెస్తాంఅమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి):: రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అమ్ ఆద్మీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సోమవారంనాడు ఆయన ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ మనం రాసుకున్న రాజ్యాంగంలో పెనుమార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయం అంటే నీచం, అవినీతి, లంచగొండితనం, సర్దుకుపోవడం, నేరాలు తదితర వాటితో మిళితమై ఉందని, ఇటువంటి రాజకీయాన్ని మార్పు చేయాల్సిన బాధ్యత పౌరులుగా మనపై ఉందని ఆయన పేర్కొన్నారు. జవహర్‌లాల్‌నెహ్రూ, లాల్‌బహుదూర్ శాస్త్రీ, బాబా సాహెబ్ అంబేద్కర్, తదితరలాంటివారు రాజకీయాల్లో ఉన్నారని, వారు కూడా ఎన్నికలలో పోటీ చేశారని కానీ, వారి రాజకీయంలో దేశభక్తి మిళితమై ఉందని, వారు ఏ పనిచేసినా దేశభక్తితో చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఇటువంటి రాజకీయాన్నే తాము కోరుకుంటున్నామని జనబహూళ్యాన్ని రాజకీయాల్లో మిళితం చేసి, దేశభక్తితో కూడిన రాజకీయాన్ని ఆవిష్క్రృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయం అంటే కొత్త అర్ధంలో, కొత్త రూపంలో మార్పు చేసి చూపిస్తామని, తాము చేసే రాజకీయ పోరాటం దేశభక్తితో కూడుకున్నదని తెలిపారు. మీరు చేసే రాజకీయ యుద్ధం 2013లో జరిగే ఢిల్లీ ఎన్నికలతో ప్రారంభిస్తారా లేదా 2014లో సార్వత్రిక ఎన్నికలతో ప్రారంభిస్తారా అని ప్రశ్నించగా తమ ముందు మూడు ఎన్నికల పోరాటాలు ఉన్నాయని ఏది ముందు ఎంచుకోవాలో తమ పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. మీ పార్టీలో అధిష్టానవర్గం అంటూ ఏదీ ఉండదుకదా అని తెలిపారు కదా మరి మీరు స్థాపించిన పార్టీలో మీరే అధిష్టానవర్గమని ప్రజలు అంటున్నారని ప్రశ్నించగా ప్రజలు ఏమనుకుంటున్నారో తనకు తెలియదని ముక్తసరిగా జవాబిచ్చారు. నవంబర్ 26, 2008న ముంబయిలో జరిగిన మారణహోమంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా నిజంగా ఇది దేశ రక్షణ స్వాలంబన కోసం కొంతమంది చేసిన విరోచిత పోరాటమని పేర్కొన్నారు. తన పక్కన నిలబడ్డ సురేందర్ అనే ఈ వ్యక్తి ఆనాటి ఘటనలో బాధితుడని దేశరక్షణకోసం తీవ్ర వాదులతో పోరాడిన యోధుడని కానీ నేడు ఇతను పెన్షన్‌కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాడని తెలిపారు. ఇతను ప్రశ్నకు సమాధానం ఇచ్చే అధికారులే కరువయ్యారని, ఈ ఘటన జరిగి నాలుగేళ్ళైన ఇతనికి పెన్షన్ రాలేదని తెలిపారు. ఇటువంటి వారికోసం తమపార్టీ పోరాడుతుందని చెప్పారు.