రాజకీయ ఊసరవెల్లులు!

భువనేశ్వర్‌, జూలై 5 : రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల్లో పున:పొందికలకు అవకాశం ఉందని సీపీఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేకు ఇదే ప్రత్యామ్నామయని స్పష్టం చేసింది. ‘రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ శక్తుల పున:పొందికకు దారి తీయవచ్చని భావిస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వరాదని నిర్ణయించినప్పటికీ పరిణామాలను సీపీఐ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజు చెప్పారు. యూపీయే, ఎన్‌డీఏ, రెండూ వినాశకర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నందున వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు కృషి చేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రపతి  ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని రాజా చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానున్నదని పేర్కొన్నారు. విధానాలు, కార్యక్రమాల ఆధారంగానే వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం రూపు దిద్దుకుంటుందని రాజా చెప్పారు. యూపీఏ అన్ని రంగాల్లో విఫలమైందని  విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలోనూ, ద్రవ్యోలబ్బణం అదుపు చేయడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  యూపీఏ పనితీరు దారుణంగా ఉన్న కారణంగా దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బాధ్యత వహించాలని రాజా డిమాండ్‌ చేశారు. పారిశ్రామిక, తయారీ, వ్యవసాయ రంగాలు దిగజారిపోయాయని ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు, బహుళజాతి సంస్థల అనుకూల విధానాలు అనుసరిస్తున్నదని ఆరోపించారు. కేంద్రం అమెరికా ఒత్తిడికి లొంగి పనిచేస్తోందన్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలు ఉన్నాయి. వాటిని ఒక పక్క పందికొక్కులు తింటుండగా, మరో పక్క పేదలు ఆకలిచావులకు గురవుతున్నారని రాజా విమర్శంచారు. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం ఆవర్భవిస్తుందని సీపీఐ ప్రగాఢంగా విశ్వసిస్తున్నదని రాజా చెప్పారు. అది ఈ రోజు జరగకపోవచ్చు. ఎప్పిటికైనా అది తప్పదని రాజా అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌, ప్రతిపక్ష అభ్యర్థి పీఏ సంగ్మాకు మద్దతు ఇవ్వరాదని సీపీఐ నిర్ణయించినట్టు రాజా చెప్పారు.