రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..

సకలం బందైనా తెలంగాణ రాలేదు
ఎమ్మెల్సీ చుక్కారామయ్య
హైదరాబాద్‌, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం నాంపెల్లి లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో ‘ఆ 42 రోజులు’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల ద్వారానే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని, ఎన్నికల తో రాష్ట్రాలు ఏర్పడవని పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిల పక్షం సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నుంచి ఇద్దరిని పిలవడం సరికాదని, ఇలాగైతే ఏకాభిప్రా యం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించా రు. టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసా దరావు మాట్లాడుతూసకల జనుల సమ్మె ఎన్నో విజయాలను సాధించిందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు ఒకే తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉద్యమాలకు సకల జనుల సమ్మె ఒక చుక్కానిల పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ఇచ్చే వరకూ పోరాటం ఆగదని, కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామన్నారు. గతంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని, అవి రికార్డ్‌ చేసుకోకపోవడం వల్ల చరిత్ర కనుమరుగైందన్నారు. తెలంగాణ ఉద్యమం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందని, ఇందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సభ అభినందనలు తెలిపింది.