రాజధాని రైతలుకు తొలివిడత చెక్కుల పంపిణీ

గుంటూరు,మార్చి9(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు తొలి ఏడాది కౌలు చెక్కులు పంపిణీచేసింది. రాజధానికి భూములు అప్పగిస్తూ రైతులు ఒప్పందపత్రాలు అందజేశారు. 104 మందికి ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారం తొలి ఏడాది కౌలు చెక్కులు అందజేశారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌, సంయుక్త కలెక్టర్‌ శ్రీధర్‌, ఇతర అధికారులు రైతులతో సమావేశమయ్యారు. ఈ విధంగా సోమవారం రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు తొలి ఏడాది కౌలు చెక్కులు ఇవ్వడం కూడా ఆరంభించారు. ముందుగా భూముల సవిూకరణకు ముందుకు వచ్చిన నేలపాడు గ్రామానికి చెందిన రైతులు నూటనాలుగు మందికి ఈ చెక్కులు ఇచ్చారు. రాజధాని అభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఈ చెక్కుల పంపిణీ జరిగింది. మరో వైపు కొందరు రైతులు బహుళ పంటలు పండే తమ భూములను ఈ సవిూకరణ నుంచి మినహాయించాలని కోరుతూ డిల్లీలో ఎఐసిసి అదినేత్రి సోనియాగాంధీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ తదితర నేతలను కలిశారు. కాగా బేతపూడికి కొందరు రైతులు సి.ఆర్‌.డి.ఎ. ఆఫీస్‌ వద్ద కు వెళ్ళి తమ అంగీకార పత్రాలు వెనక్కి ఇచ్చివేయాలని రెండు రోజుల క్రితం డిమాండ్‌ చేశారు.

.