రాజా పిటిషన్‌పై మీ స్పందనేమిటి ?

సీబీఐకి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలన్న విచారణ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎ. రాజా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. రాజా పిటిషన్‌పై సెప్టెంబరు 6లోగా జవాబు ఇవ్వాలని జస్టిస్‌ ఏకే పాఠక్‌ సీబీఐని ఆదేశించారు. ఇతర నిందితులు దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లపై కూడా సెప్టెంబరు 6నే విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2జీ కేసులో అరెస్టయి 15 నెలలపాటు జైల్లో ఉండి గత మేలో బెయిలుపై విడుదలైన రాజా… సీబీఐ విచారణ అంతా పక్షపాతంగా జరిగిందని, స్పెక్ట్రం కేటాయింపులో అక్రమాలపై ప్రత్యేక న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.