రాజీవ్‌ యువకిరణాలు యువత సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రాజీవ్‌ యువకిరణాలు పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను చదువుకున్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి పి. సబితాఇంద్రారెడ్డి సూచించారు. మంగళవారం మహేశ్వరం మండలంలోని మంకాల్‌ గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. దీంతో పాటు హర్షగూడ, రావిర్యాల గ్రామల్లో 1.50 కోట్లతో చేపట్టిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ భవనాలు, ఒహెచ్‌ఎస్‌ఆర్‌, నీటి సంపులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్షగూడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ మహేశ్వరం, కందుకూరు మండలాలకు కృష్ణా త్రాగునీటిని అందించేందుకు 40కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు ఇందులో భాగంగా ప్రత్యేకంగా కృష్నా మంచినీటికై సంపులను నిర్మించడం జరుగుతుందని, దీనివలన ఈ గ్రామాల్లో ఉన్న ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుందని మంత్రి తెలిపారు. అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద 4కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ వాడల్లో మురికి కాల్వలు, సిసి రోడ్లు ఇతర మౌళిక సదుపాయలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికి ఇళ్ళ స్థలాలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.