రాజుకుంటున్న సింగూర్ చిచ్చు

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తో కార్చిచ్చు రాజుకుంటూనే ఉంది. మరోవైపు ఉమ్మ డి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూనే దిగువన ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమర్థించుకుంటుండడంతో మడతపేచీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసారు. సీపీఎం సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి బీరం మల్లేశం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించిన శ్రేణులను పోలీసులు అడ్డుకోగా గేటును తోసుకుంటూ లోపలకు వెళ్లే ప్రయత్నం చేసారు. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా నీటిని దౌర్జన్యంగా తరలించుకుపోతోందని మల్లేశం ధ్వజమెత్తారు. సింగూర్ నీటి విడుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి పట్టణంలోని ఐటిఐ నుంచి సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడికి భారీ ర్యాలీతో బయలుదేరారు. కలెక్టరేట్ వద్ద హైదరాబాద్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై వందలాది మంది బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీ జలదోపిడీకి పాల్పడుతుందంటూ డిసిసి అధ్యక్షురాలు సునితారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏకంగా సింగూర్ ప్రాజెక్టు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు సింగూర్ ప్రాజెక్టు ముట్టడికి విఫలయత్నం చేసారు. మండల కేంద్రమైన పుల్కల్ నుండి వెళుతున్న బీజేపీ నాయకులు, శ్రేణులను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్వంత పూచీకత్తుపై విడుదల చేసారు. సిం గూర్ నీటిని జీఓలు లేకుండా, సర్క్యులర్ లేకుండా వౌఖికంగా విడుదల చేస్తూ అధికార దుర్వినియోగానికి టీఆర్‌ఎస్ పార్టీ పాల్పడడాన్ని ఎట్టిపరిస్థితు ల్లో నూ సహించేది లేదని, నీటి విడుదలను బేషరతుగా నిలుపుదల చేసే వరకు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాడివేడిగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో సింగూర్ నీటి విడుదల ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.