రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవిపై కాంగ్రెస్‌ కన్ను

మమతతో అహ్మద్‌ పటేల్‌ మంతనాలు?

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కలిసి చర్చించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుతున్న నేపథ్యంలో వీరి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉన్నందున మద్దతు కోరేందుకు అహ్మద్‌ పటేల్‌ మమతను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నామినేట్‌ చేసే వ్యక్తికి మద్దతివ్వాలని ఆమెను కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్‌ పటేల్‌ మమతతో దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌ పదవిలో కాంగ్రెస్‌ నేత పీజే కురియన్‌ ఉన్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. అయితే మరో మారు కూడా ఆ పదవిలో కొనసాగేందుకు కురియన్‌ నిరాకరిస్తున్నారు. దీంతో ఆ పదవికి కాంగ్రెస్‌ పార్టీ వేరే అభ్యర్థిని పోటీకి దింపనుంది. డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. ఇప్పుడు రాజ్యసభలో భాజపాకే ఎక్కువ స్థానాలున్నాయి.దీంతో కాంగ్రెస్‌ ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే నవీన్‌ పట్నాయక్‌కు చెందిన బిజు జనతా దళ్‌(బీజేడీ) పార్టీ తొమ్మిది మంది ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆరుగురు ఎంపీల ఓట్లు కీలకంగా మారాయి. వీళ్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని ఇప్పటికే వెల్లడించారు.