రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలి
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వర్గీకరణ ప్రతిపాదనను పక్కనబెట్టి దళితులు తమ హక్కులు,రాజ్యాధికారం కోసం ఐక్యంగా కలిసి పోరాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు.దళితులకు కావాల్సింది వర్గీకరణ కాదని,అభివృద్ధి అని పేర్కొన్నారు.ఆదివారం స్థానిక రితిక ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన ఆ సంఘ సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు.మాలలంతా ఐక్యంగా ఉండి పోరాడాలని,పోరాడితేనే తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు.బిజెపి ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారానే దళితులకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని అన్నారు.ప్రస్తుతం అగ్రవర్ణ మనువాద పార్టీల ఆధిపత్యం నడుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐక్య పోరాటాల ద్వారానే రాజ్యాధికారం దక్కుతుందని పేర్కొన్నారు.అనంతరం జిల్లా నూతన కమిటీని ప్రకటించారు.సూర్యాపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా యశోద రవిని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, బొల్లెద్దు దశరథ, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి గాజుల రాంబాయమ్మ , మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ , చింతమళ్ళ జ్యోతి , నామా నాగయ్య , బోల్లెద్దు వెంకన్న , కట్ల మురళి, చందా దాస్ , బండ్ల రమేష్ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.