రామలింగారెడ్డి నిఖార్సయిన ఉద్యమనేత
ఆయన లేకుండా సభ జరుపుకుంటామనుకోలేదు
చిట్టాపూర్‌లో విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో అనుకోలేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాలు అనేకమని గుర్తు చేసుకున్నారు. గడ్డకట్టే చలిలో కేసీఆర్ ఆమరణ దీక్షలో లింగన్న తాను ముందుండి నడిచామన్నారు. కేసీఆర్ అడుగుజాడలో నడిచిన వ్యక్తి రామలింగారెడ్డి అని తెలిపారు. రామలింగారెడ్డి రెడ్డి జీవతంలో మిగిలేది ఆయన ఉద్యమమే అని ఆయన చెప్పుకొచ్చారు. దుబ్బాక నియోజకవర్గంపై అభిమానం ప్రేమ ఉంటుందని,.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ మత్తడి దుంకుతే అందులో లింగన్న మోహం కనిపించిందన్నారు. లింగన్నతో కలిసి పనిచేసిన అనుభవాలు, జ్ఞాపకాలు ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి అని కొనియాడారు. అతి ఎక్కువ డబుల్ ఇండ్ల నిర్మాణాలు చేయించిన వ్యక్తి రామలింగారెడ్డి అని మంత్రి హరీష్ రావు తెలిపారు