రాయల్ బెంగాల్ టైగర్ మృతి
నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి
హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్ మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది.
2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.అభిమన్యుకు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉన్న అభిమన్యుకు అన్ని రకాల వైద్యసేవలు జూ వెటర్నరీ విభాగం అధికారులు అందించడంతో పాటు వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు.
ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి. బెంగాల్ టైగర్‌ను రక్షించేందుకు మెరుగైన చికిత్సలు అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని జూపార్క్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి నెహ్రూ జూపార్క్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.