రాష్టాభ్రివృద్దికి పునరంకితం అవుతాం

కాకినాడ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంలో సంపూర్ణంగా భాగస్వాములు అవుతామని జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం గొప్పకాదని, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వడమే సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఆర్థికలోటుతో ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగుల సంక్షేమం కోసం చంద్రబాబు చూపిన చొరవ మరువలేమన్నారు.నవ్యాంధప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి సెలవు రోజుల్లోనూ సేవలు అందించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీఎన్జీవో సంఘ నాయకులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయటానికి సముఖంగా ఉన్నారన్నారు. పదో వేతన సవరణ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘానికి మొత్తం 16 డిమాండ్లు ఇచ్చామని, వీటిలో కొన్నింటిని నెరవేర్చాల్సి ఉందన్నారు. ప్రధానంగా ఒప్పంద ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని కోరారు. ఈనెల 20న దీనిపై జరిగే మంత్రివర్గ ఉపసంఘంలో తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. పొరుగుసేవల సిబ్బందికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల 80 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా ప్రకటించాలని కోరారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధప్రదేశ్‌కు రావాల్సిన నిధుల కోసం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు మాలమహానాడు ఉభయ గోదావరి జిల్లాల సంఘ అధ్యక్షులు బొండాడ నూకరాజు వెల్లడించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇస్తానని హావిూ ఇచ్చిన నిధుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని  ప్రశ్నించారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని కోటి సంతకాల కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకులు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.