రాష్ట్రంలో కుటుంబపాలన
– కమీషన్ల కోసమే ప్రాణహిత మార్పు
– పాదయాత్రలో కాంగ్రెస్‌నేతల ఆరోపణ
నిజామాబాద్, నవంబర్ 3(జనంసాక్షి):
రాష్ట్రంలో అప్రజాస్వామిక కుటుంబ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేవలం కుటుంబ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ నుంచి మంచిప్ప వరకు కాంగ్రెస్ నేతలు ప్రాణహిత పాదయాత్ర చేపట్టారు. ప్రాణహిత-చేవెళ్ల 20, 21, 22 ప్యాకేజీ పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మధు యాష్కీగౌడ్, సుదర్శనరెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. దాదాపు 8 కిలోవిూటర్ల మేర కాంగ్రెస్ నేతల పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాణహిత మార్పుకేవలం కెసిఆర్ కుటుంబం కోసమేనని అన్నారు. వాటర్‌గ్రిడ్ పేరుతో దోపిడీకి పెద్దపీట వేశారని అన్నారు. ఈ సర్కార్‌కు బుద్ది చెప్పాల్సిన తరుణం ఆసన్నమయ్యిందన్నారు. 26 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహితను కేవలం కమిషన్ లకోసమే మార్పుచేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలుకాక తప్పదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినందుకు జిల్లా సాగు నీటి ప్రయోజనాల కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. 20, 21 ప్యాకేజీ పనులు బినోల నుంచి కామారెడ్డి వరకు జరిగేలా చేశామన్నారు. వ్యవసాయ రంగానికి మేలు కలగాలనే ఒకే ధ్యేయంతో రూ.3,400 కోట్లను
కేటాయించి 51 శాతం పనులు చేయించామన్నారు. తెరాస ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్ మార్పు పేరుతో పనులు నిలుపుదల చేసి గుత్తెదార్లను వెళ్లగొట్టారన్నారు. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆలోచనను సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత డిజైన్ తప్పయితే కాళేశ్వరం నుంచి సిద్ధిపేట, నిజాంసాగర్‌కు నీరు ఎలా వస్తాయన్నారు. 21 ప్యాకేజీ ద్వారా నిజామాబాద్ నగరం, గ్రామాలు బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. తాగునీటి కొరత రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళిక రచించలేదని ఆయన నిందించారు. సర్కార్ నిరంకుశానికి నిరసనగా ప్రాణహిత, చేవెళ్ల పనులు ప్రారంభించాలని డిమాండు చేస్తూ మంగళవారం జిల్లాలో రెండో విడత పాదయాత్ర చేపట్టామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మొదటి విడతగా 20 రోజుల కిందట బినోల నుంచి పాదయాత్ర చేశామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రెండవసారి మంచిప్ప నుంచి మోపాల్ వరకు 10 కిలోవిూటర్ల పాదయాత్ర చేపడుతున్నామన్నారు. పాదయాత్రను విమర్శిస్తున్న అధికార పార్టీ నేతలు ఆపేసిన ప్రాజెక్టు పనులు ప్రారంభింపజేస్తే ప్రశంసిస్తామన్నారు. మధుయాష్కీ మాట్లాడుతూ కావాలని ప్రాజెక్ట్ పనులు ఆపి దందా మొదలు పెట్టారని అన్నారు. ఈ సర్కార్ కేవలం వసూళ్లకు అలవాటు పడిందన్నారు. కంట్రాక్టర్ల నుంచి
పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని అన్నారు. దీనికి వరంగల్ ఉప ఎన్నికలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతందన్నారు. మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ సర్కార్ తీరును దుయ్యబట్టారు. ప్రాణహితను స్వలాభం కోసం మార్చాలనుకోవడం సరికాదన్నారు. వెంటనే యధావిధిగా ప్రాజెక్ట్ పనులు చేపట్టాలన్నారు.