రాష్ట్రంలో ఘనంగా హోలీరాజ్‌భవన్‌లో గవర్నర్‌

క్యాంపు కార్యాలయంలో సీఎం సంబురాలు

హైదరాబాద్‌, మార్చి 27 (జనంసాక్షి) :

రాష్ట్రంలో హోలీ వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం దాక ఈ వేడుకల్లో తలమునకలయ్యాయి. రంగుల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ సంబరాల్లో గవర్నర్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్‌ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు సైతం పాల్గొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు గవర్నర్‌ దంపతులను కలిసి అభినందనలు తెలియజేశారు. సిఎం క్యాంపు కార్యాలయంలోనూ హోలీ సంబరాలను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రి దానం నాగేందర్‌, కొందరు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో వాకర్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరిగాయి. వృద్ధులు సైతం నృత్యాలు చేయడం అందర్నీ ఆకట్టుకున్నాయి. బేగంబజార్‌, చార్మినార్‌, మదీనా, చత్రి, సికింద్రాబాద్‌ మహంకాళి గుడి వద్ద, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, మెహదీపట్నం, లక్డీకాపూల్‌, కోఠి, ఆబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, లిబర్టీ, చిక్కడపల్లి, కాచిగూడ, ఉప్పల్‌, ఘటకేశర్‌, దిల్‌సుక్‌నగర్‌, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, చందానగర్‌, తదితర ప్రాంతాల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇదిలాఉండగా పోలీసుల ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు బంద్‌ పాటించాయి. బ్యాంకులు యధావిధిగా పనిచేశాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, తదితర నగరాల్లో వైభవంగా హోలీ వేడుకలు సాగాయి. కూకట్‌పల్లిలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. అమీన్‌ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంతేగాక పలు ప్రాంతాల్లోని పలువురు కంటి సమస్యలతో వైద్యులను ఆశ్రయించినట్టు సమాచారం. వరంగల్‌ నగరంలోను, జిల్లాలోను హోలీ సంబురాలు మిన్నంటాయి. హన్మకొండలో సైతం యూత్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వరంగల్‌లోని ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎంపి రాజయ్య పాల్గొన్నారు. యువకులతో కలిసి ఆడిపాడారు. కరీంనగర్‌ నగరంలోను, జిల్లాలోను హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కరీంనగర్‌లో జరిగిన సంబురాల్లో ఎంపి పొన్నం ప్రభాకర్‌ సైతం పాల్గొన్నారు. అలాగే ఎస్‌ రవీందర్‌ సైతం పాలుపంచుకున్నారు. విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలోను సంబురాలు కొనసాగాయి. ఆదిలాబాద్‌లోని మార్వాడీ ధర్మశాలలో వైభవంగా సంబురాలు జరిగాయి. చిన్నా పెద్ద సైతం వేడుకల్లో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ మతసామరస్యాన్ని చాటారు. అలాగే ఖమ్మం పట్టణంలో కామదహనం నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద పాత చెక్కలను, పాత చెక్క సమానులను వేసి కామదహనం నిర్వహించారు. ఆ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యం అందర్నీ అలరించింది.