రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు
– రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్,జనవరి 6(జనంసాక్షి): ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని కోళ్లలో ఇప్పటి వరకు వైరస్ ఆనవాళ్లు కనపడలేదని చెప్పారు. వినియోగదారులు, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు సంక్షేమ భవన్‌లో బర్డ్ ఫ్లూ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటకు రావడంతో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పనపై చర్చించారు. అన్ని స్థాయిల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు.ఐబీఆర్‌ఐ నిరంతర పర్యవేక్షణలో సమాచారం సేకరిస్తుండగా.. 300 మంది అధికారుల నేతృత్వంలోని బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. బర్డ్ ఫ్లూపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పశుసంవర్థక శాఖ, పౌల్ట్రీ పరిశ్రమ సంయుక్త భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్‌కు 56 దేశాల నుంచి వలస పక్షులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ సోకే సూచనలు ఉంటాయని.. మిగతా ప్రాంతాల్లో రావడానికి అవకాశం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.