రాష్ట్రంలో 231 కరువు మండలాలు
– సత్వరం సాయం చేయండి
– కేంద్రానికి సర్కారు నివేదిక
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): రాష్ట్రంలో 231 మండలాల్లో కరువు తలెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 231 మండలాల్లో కరువు నెలకొన్నందున కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపిన నివేదికలో విజ్ఞప్తి చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరువు మండలాలలపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి విూనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాపాతం బాగానే ఉందని సమావేశంలో నిర్దారించారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షికంగా కరువు ఉన్నట్టు ఒక నిర్దారణకు వచ్చారు. మొత్తం ఈమేరకు కరువు మండలాల పరిశీలనకు కేంద్రం వెంటనే రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం వెయ్యి కోట్ల రూపాయల సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేందప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు ఓ బృందాన్ని కూడా పంపాలని ఆయన కోరారు.