రాష్ట్రపతికి తెలంగాణ సెగ
ప్రణబ్‌కమిటీ నివేదిక ఏమైందని నినదించిన విద్యార్థులు
హై సెక్యూరిటీ జోన్‌లో జై తెలంగాణ
పదిమంది ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్, డిసెంబర్ 26 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జికి తెలంగాణ సెగ తప్పలేదు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెలంగాణ నినాదాలతో నిరసన తెలిపారు. హై సెక్యూరిటీ జోన్‌లోకి చొచ్చుకువెళ్లి జై తెలంగాణ అని నినదించారు. యూపీఏ-1 ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన ప్రణబ్ కమిటీ నివేదిక ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎంతగా ఉందో చూడాలని కోరారు. విద్యార్థులు సంఘం జెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని ఈడ్చుకువెళ్లి దాడి చేశారు. రాష్ట్రపతి వాహనం వైపునకు చొచ్చుకురాకుండా నిరోధించారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అవాక్క య్యారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన తర్వాత కూడా విద్యార్థులు నిరసనకు దిగడంతో తెల్లముఖం వేశారు. చివరికి విద్యార్థులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ వాదం లేదని డబ్బు మదంతో మాట్లాడేవారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జీవవైవిధ్య సదస్సుకు వచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ ్‌కు ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని చాటిచెప్పామని, దీంతో బెంబేలెత్తిన ఆయన ఆకాశమార్గాన సదస్సుకు చేరుకున్నాడని గుర్తు చేశారు. వచ్చిరాని తెలుగులో తెలంగాణ గురించి అవాకులు, చెవాకులు పేలిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వాహనంపై రాళ్ల వర్షం కురిపించిన విషయం మరువొద్దని అన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి పర్యటనలోనూ తమ ఆకాంక్షను మాత్రమే వ్యక్తం చేశామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.