..రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురుస్తున్న వానలు

నిండుకుండల్లా పలు జలాశయాలు
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు
ఉప్పొంగుతున్న ప్రాణహితనది
మూసీనది మూడు గేట్లు ఎత్తివేత

 

హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి  ): రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల జనజీవనం అతలాకుతలమవుతున్నది. ప్రాణహిత నది పొంగి ప్రవహిస్తుండ డంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి 97 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. దీంతో 35 గేట్లను ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే తుపాకుల గూడెం (సమ్మక్క) బ్యారేజీ, శ్రీరాంసాగర్‌, కుమ్రంభీం ప్రాజెక్ట్‌, వట్టివాగు ప్రాజెక్ట్‌ , కడెం ప్రాజెక్ట్‌ తదితర ప్రాజెక్టులకు ఇన్‌ ప్లో వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో రాష్ట్రంలో చెరువులు, వాగులు, నిండుకుండల మారాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఎª`లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఎª`లో 1,253 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 641.10 అడుగులు. మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.47 టీఎంసీలుగా ఉంది. శుక్రవారం కూడా ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తారు. ఒక్కో గేటును ఫీటు మేర ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం రాత్రి వరకు వదలకుండా కురిసింది. రాత్రింబవళ్లు విడవకుండా వర్షం పడుతుండడంతో ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడిరది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో అధికంగా 19 సెంటీవిూటర్లు, ఖమ్మంజిల్లా కూసుమంచి మండలంలో 14 సెంటీ విూటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లను వరద ముంచెత్తడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో గోడ కూలి తల్లీకూతుళ్లు చనిపోగా.. వేర్వేరు చోట్ల వరదలో కొట్టుకపోయి ముగ్గురు గల్లంతయ్యారు. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వాన నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్‌, సిద్దిపేట, నిర్మల్‌, నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి, జనగామ, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో తెరిపి లేకుండా ముసురు పడుతున్నది. మహబూబాబాద్‌ జిల్లాలో ఆకేరు, పాలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరగడంతో డోర్నకల్‌ నుంచి గార్ల మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం గండ్లచెరువు అలుగు పారడంతో పాలేరు రిజర్వాయర్‌ లోకి నీరు చేరుతున్నది. సంగెం బందం చెరువు అలుగు పోస్తుండడంతో కోడూరు, తుంగతుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామేపల్లి మండలంలోని లింగాల, డోర్నకల్‌ రూట్‌లో బండిపాడు దగ్గర బుగ్గవాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఖమ్మం, మహబూబాబాద్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. కారేపల్లి మండలం పేరుపల్లి సవిూపంలో బ్రిడ్జిపై నుంచి బుగ్గవాగు ప్రవహిస్తుండడంతో మాదారం గ్రామానికి
రాకపోకలు నిలిచిపోయాయి. మధిర మండలం మాటూరు, మాటూరుపేట మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోవడంతో 5 గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిరది. తల్లాడ మండలం రామచంద్రా పురం, వెంకటగిరి, గూడూరు మధ్య వాగు పొంగడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. పెనుబల్లి మండలంలో పెనుబల్లి, గంగదేవిపాడు గ్రామాల మధ్య వాగు పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. కొత్తలంకపల్లి దగ్గర రైల్వే ట్రాక్‌ విూదుగా వరద నీరు ప్రవహించింది. ముదిగొండ మండలంలో అమ్మపేట, వల్లాపురం గ్రామాల మధ్య వాగు పొంగడంతో రోడ్డుపై నుంచి వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తున్నది. కడెం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడం తో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. ఇటివల జగిత్యాలలోని మోతె చెరువు గండి పడి వర్షపు నీరు రోడ్ల పైకి రావడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఖమ్మంలో లోతట్టు ప్రాంతాలైన మయూరి సెంటర్‌, పాత బస్టాండ్‌, మోతీనగర్‌, పంపింగ్‌ వెల్‌ రోడ్‌, వైఎస్‌ఆర్‌ నగర్‌, రమణగుట్ట, బీసీ కాలనీలో రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు నిలిచింది. సూర్యాపేట పట్టణంలో మానసనగర్‌, స్నేహనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు ఈ ప్రాంతాల్లో సహాయ చర్యలు ప్రారంభించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు బిల్డింగ్‌ గోడ కూలిపోయింది. మహబూబ్‌?నగర్‌? జిల్లా మహమ్మదాబాద్‌ మండలం చిన్నాయ పల్లిలో వర్షానికి చెంచు మొగులమ్మ ఇల్లు కుప్ప కూలింది. జగిత్యాలలోని ఇందిరానగర్‌లో అల్లకుంట రాములు ఇల్లు కూలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వానలతో ఇల్లందు కొత్తగూడెం మణుగూరు ఏరియాలోని ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమనేపల్లి మండలం దిందా వాగు శుక్రవారం సాయంత్రం ఉప్పొంగడంతో స్టూడెంట్లు అవస్థలు పడ్డారు. ఉదయం స్కూల్‌ కు వెళ్లే టైమ్‌లో మామూలుగా ఉన్న వాగు మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో పేరెంట్స్‌ వాగు దాటి వెళ్లి తమ పిల్లలను ఎత్తుకొని వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కోడిపుంజులవాగులో చేపల వేటకు వెళ్లి శంకర్‌అనే వ్యక్తి గల్లంతయ్యాడు. దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామస్థులు గుబ్బలమంగి ప్రాజెక్టు వద్ద చేపల వేటకు వెళ్లగా ఏనిక దుర్గమ్మ(55) అనే వృద్ధురాలు వాగులో కొట్టుకుపోయింది. భద్రాచలం డివిజన్‌కు సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా సీల్‌గాల్‌గ్రామ అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన సూరజ్‌ అనే జవాన్‌ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.