రాష్ట్రానికి బర్డ్‌ఫ్లూ వచ్చే అవకాశంలేదు – మంత్రుల స్పష్టీకరణ

 

హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అపోహల వల్ల పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి సన్నద్ధతపై వివిధ శాఖల అధికారులు, పౌల్ట్రీరంగ ప్రతినిధులతో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై సవిూక్షించారు. దేశంలో అందరికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశామని మంత్రి తలసాని చెప్పారు. రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఏమాత్రం ఏదని, చికెన్‌, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదని ఆయన అన్నారు. అవసరమైన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, అనవసర భయాందోళనలు వద్దని తలసాని సూచించారు. ఎలాంటి అపోహలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ రంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, వలస పక్షుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.