రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు
హెదరాబాద్, అక్టోబర్ 2 (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. వేల ఎకరాల్లో పంటపోలాలు నీట మునిగాయి. పలుచోట్ల చెరువులకు గండ్లుపడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తల మెంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తూ.. సహాయక చర్యలు చేపడుతోంది. రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ, కోస్తా, ఆంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అల్పపీడనం కారణంగా సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై
నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఖైరతాబాద్, అవిూర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సోమాజీగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్‌బీనగర్, తార్నాక, ఖైరతాబాద్, రామాంతాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపైకి నీరు చేరింది. కొన్ని చోట్ల మూడు అడుగుల మేర నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా భారీ వర్షాలతో తడిసిముద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి కొంత తెరిపినిచ్చినప్పటికీ, మంగళవారం ఉదయం నుంచి మళ్లీ జోరుగా వాన కురుస్తుండడంతో జన జీవనం స్తంభించింది. ఉంగుటూరు మండలం పెద్దవెల్లిమిల్లిలో వాగులో పడి వృద్ధుడు గల్లంతయ్యాడు. ఉండ్రాజవరం మండలంలో ఎస్సీ హాస్టల్‌లోకి నీరు చేరింది. నల్లజెర్లలోని రెండు కాలనీల్లోకి వరదనీరు చేరడంతో.. 30 కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారు. ఏలూరు నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. శాంతినగర్, అశోక్‌నగర్, శనివారపుపేట, సత్రంపాడు తదితర ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు రాత్రంతా జాగారం చేశారు. సత్రంపాడు రాజీవ్ వారధి అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీళ్లు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వాణీమోహన్ ఆదేశించారు. ఏలూరులో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలు పరిశీలించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నెం. 08812-230612.
ఇటు కరీంనగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. హుజురాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల్లో కుండపోతగా వర్షం కురిసింది. హుజురాబాద్‌లో పిడుగు పడి పాడి ఆవులు మృతి చెందగా, భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నిజమాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆర్మూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, కామారెడ్డి, బోధన్, బిచ్కుంద తదితర మండాలాల్లో పంట పొలాలు నీట
మునిగాయి. భారీ వరద వస్తుండడంతో కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దయ్యింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కడెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటపోలాలు నీట మునిగాయి. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే, గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలనున్నట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో భారీ వర్షాపాతం నమోదైంది. మరోవైపు, పలుచోట్ల రహదారులపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాజీపేట రైల్వేస్టేషన్‌ను వర్షపునీరు ముంచెత్తింది. పరకాల దగ్గర 1200 ఎకరాల్లో పత్తిపంట నీట మునిగింది. కురివి మండలం చింతపల్లిలో చెరువుకు గండిపడింది. భూపాలపల్లిలో మోరంచవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రాఆమలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. గన్నవరం మండలం పురుషోత్తమపట్నంలోని చీమలవాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. జిల్లాలోని బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి నుంచి భారీవర్షాలు కురుస్తండడంతో బుడమేరు వాగు పోటెత్తింది. దీంతో గంగలేరు వద్ద నిర్మించిన రెగ్యులేటర్ వద్ద మంగళవారం ఉదయం 6.5 అడుగుల మేర నీటి మట్టం చేరింది. మరో మూడడుగులు దాటితే షట్టర్లు ఎత్తి నీటిని దిగువకు వదలనున్నారు. ప్రస్తుతం వరద నీటిని మళ్లింపు కాల్వల ద్వారా కృష్ణానదిలోకి తరలిస్తున్నారు.
భారీ వర్షాలు పడే అవకాశం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరింత బలపడతుఓంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య తీరంలో ఉత్తర కోస్తాను ఆనుకొని స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఇదే పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కదులుతోంది. వీటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, తెలంగాణ రాయలసీమాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.