రాహుల్‌ది దగుల్బాజీ పథకం
రాజకీయ పార్టీలకు ఈ దేశంలో ప్రజలు ఏ రకంగా కష్టాల నుంచి గట్టెక్కించాలో తెలియడం లేదు. వారిని చేష్టలుడిగి ఓటు యంత్రాలుగా మార్చే ప్రక్రియను మాత్రమే చేపడతున్నారు. ఈ దేశంలో అత్యధికంగా ఉన్న రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందన్న విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రభాగాన ఉంది. దానికి దేశ సమస్యలపై అవగాహన లేదు. ఆ తరవాతి స్థానంలో బిజెపి ఉంది. మోడీ 2014లో అధికారంలోకి రాకముందు రైతుల కోసం హావిూల వర్షం కురిపించినా ఆయనా విఫల మయ్యారు. కొద్దోగొప్పో తెలంగాణ నయం. ఇక్కడ కొంతమేరకు అయినా రైతు సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడిగా సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. అయితే అవన్నీ కూడా ఆచరణలో పెద్దగా విజయం సాధించడం లేదని నిజామాబాద్‌లో పసుపు, ఎర్రజొన్నల రైతుల దీనస్థితి చూస్తే తెలుస్తుంది. నిజానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయడం ముఖ్యం. ఈ విషయంలో కేంద్ర విధానాలు సక్రమంగా లేవని అర్థం అవుతోంది. ఈ-నామ్ ప్రవేశ పెట్టినా అమలులో అది సక్రమంగా నడవడం లేదన్న విషయం మోడీ గుర్తించలేదు. దీనికితోడు ఎంతసేపు ఓట్లు కుమ్మరించే పథకాలతో బురిడీ కొట్టించే ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన డబ్బులు వేసే పథకం కూడా ఇలాంటిదే. లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రజల్ని ఆకర్షించేందుకు కనీస ఆదాయ భరోసా పథకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. దేశంలోని 20 శాతం మంది అత్యంత నిరుపేదల ఖాతాల్లోకి నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72వేలు జమ చేస్తామన్నారు. ఇలా డబ్బులు జమచేయడానికి ఆయనెవరు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్నది చెప్పలేదు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఇదే చివరి దాడి అని చెప్పుకొచ్చారు. దేశంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలుచేస్తాం అని ప్రకటించిన పథకం కేవలం ఓట్ల కోసం తప్ప మరోటి కాదు. ఇది ఆర్థిక వ్యవస్థను మరింతగా కుంగుబాటుకు చేసేది తప్ప మరోటి కాదు. దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.72వేల చొప్పున అందజేస్తాం అని చెప్పి ఖజానాను గుల్లచేసే పథకం ప్రకటించారు. మోడీకి ముందు పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ ఏనాడూ రైతులగురించి, పేదల గురించి లోచించలేదు. స్కాంలవిూద స్కాంలు చేసి దేశాన్ని భ్రష్టు పట్టించింది. అవన్నీ ప్రజలు మరచిపోయేలా మళ్లీ పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే దేశ చరిత్రలోనే ఇది చరిత్రాత్మక రోజు అని రాహుల్ ప్రకటించుకున్నారు. ఆర్థికనిపుణులు, మేధావులతో చర్చించాక దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ఈ వినూత్న పథకాన్ని తీసుకుని వస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇంతకన్నా దరిద్రపు ఆలోచన మరోటి ఉండదు. పేదలకు ఎలాంటి పథకాలు ప్రవేశ పెడితే వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలరో ఆలోచించని ఉదారపథకం తప్ప మరోటి కాదు. నిజానికి రైతుల గురించి, గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాజకీయ పార్టీలు పటిష్టమైన కార్యాచరణ చేయడం లేదు. ఐదేళ్ల అధికారం కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా తయారు చేస్తున్నారు. ప్రజలు తమకాళ్లవిూద తాము నిలబడేలా పథకాలు రూపొందించడం లేదు. ఇందుకు ఉదాహరణ నిజామాబాద్ రైతులను తీసుకోవాలి. వ్వయసాయాన్ని, దాని అనుబంధ పరిశ్రమలను అభివృద్ది చేసివుంటే ఇవాళ ఇంతటి దురవస్థ వచ్చి ఉండేది కాదు. ప్రజాస్వామ్య రణక్షేత్రమైన ఎన్నికలనే తమ డిమాండ్‌ల సాధనకు కార్యస్థలంగా మలుచుకుంటున్న నిజామాబాద్ జిల్లా రైతులు ఒక్క సారిగా భారతావని దృష్టిని ఆకర్షించారు. పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించాలనే డిమాండ్‌తో పెద్ద
ఎత్తున ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు ఎన్నికలబాట పట్టారు. వారు మూకుమ్మడిగా నామినేషన్లు వేసి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. విూ ఆలోచనల్లనీ తూచ్ అని గట్టిగా చెప్పారు. రైతులకు ఏం చేయాలో వారిని నేరుగా కలసి అడిగితే చెప్పేవారు. రాహుల్ లాంటి వారికి పేదరికం,పేదల గురించి చెబితే తెలుసుకునే స్థాయిలేదు. మోడీకి ఈ దేశం మంచి అవకాశం ఇచ్చినా రైతుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోయారు. ఆయనా రైతులకు డబ్బులు వేసే పథకాన్ని చేపట్టారు. నిజానికి రైతులకు పంటలు కొనుగోలు చేసేలా పథకాలు ఉండాలి. వాటిని ప్రజలకు తిరిగి అమ్ముకునేలా కార్యక్రమాలు ఉండాలి. కానీ అలాజరగడం లేదని రైతులు తమ ఆవేదనను నామినేషన్ల రూపంలో వ్యక్త పరిచారు. నిజామాబాద్‌లోని ఆర్మూర్ డివిజన్, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపు, ఎర్రజొన్న పంటలు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తుంటారు. ఈ రెండు పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసే జాబితాలో లేవు. వ్యాపారులు మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయించి కొంటుంటారు. పసుపు పంటకు మద్దతు ధర దక్కడం లేదని ఆక్రోశిస్తూ వందకు పైగా మంది అన్నదాతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నామినేషన్లు వేసి రాజకీయ పార్టీల కుళ్లును బయటపెట్టారు. అన్నదాతలకు ఏంచేస్తే బాగుంటుందన్న విషయాన్ని ఆలోచన చేయాలి. రైతుల కోణంలో చేసే ఆలోచనలు ఫలితం ఇస్తాయి. రైతులకు తెలంగాణ సిఎం కెసిఆర్ అనేక విధాలుగా ఆదుకునే పథకాలు చేపట్టినా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రధాన సమస్యను విస్మరించారు. దీనికి పసుపు, ఎర్రజొన్నల సమస్యే ప్రధాన కారణం. అలాగే కంది, మిర్చి రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేసే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచించి, పథకాలకు రూపకల్ప చేయాలి. డబ్బులను పంచే బదులు పంటలను కొనుగోలు చేయాలి. ఈ పంటలను పేదలకు తక్కువ ధరలకు అమ్మేలా చూడాలి. అప్పుడు రైతులు, పేదలు బాగుపడతారు. రూపాయికే కిలోబియ్యం లాంటి పథకాన్ని ఎత్తేయాలి. సరసమైన ధరలకు ఆహార పదార్థాలను ప్రజలకు అందించేలా రైతులను ప్రోత్సహించిన రోజు మాత్రమే గ్రావిూణ భారతం వర్ధిల్లుతుంది.