రిలయన్స్ గ్యాస్ లీక్-చెలరేగిన మంటలు
మద్దికుంటలో తప్పిన పెనుప్రమాదం
సంగారెడ్డి: మెదక్ జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటలో సోమవారం తెల్లవారుజామున రిలయన్స్ గ్యాస్ గ్యాస్ పైపు లైను నుంచి గ్యాస్ లీకైంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రిలయన్స్ అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. కాకినాడ నుంచి గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు గ్యాస్‌ను తరలించేందుకు రిలయన్స్ సంస్థ భూగర్భ మార్గంలో పైపులైన్ ఏర్పాటు చేసింది. మద్దికుంట ఎస్సీకాలనీ సమీపం నుంచి వెళ్లిన పైపులైన్ వద్ద 14వ నంబరు మెయిన్ లెవెల్ వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాల్వ్‌లో నుంచే సోమవారం తెల్లవారుజామున 2.30 సమయంలో మధ్య గ్యాస్ లీకైంది. ఆ వెంటనే క్షణాల్లో మంటలు సుమారు 30 మీటర్లకు ఎత్తున ఎగసిపడ్డాయి. గ్యాస్ లీకైన వెంటనే అప్రమత్తమైన మెయిన్ లెవెల్ వాల్వ్ భద్రతాధికారులు సదాశివపేట పోలీసులకు సమాచారాన్ని అందించారు. డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, ఫైర్ సర్వీసులు మద్దికుంట గ్రామానికి చేరుకున్నాయి. గ్రామస్థులందరినీ అప్పటికప్పుడు ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరానికి తరలించారు. ఎటువైపు ఇళ్లున్న వారిని అటువైపున ఉన్న వెనుక ప్రాంతాలకు పంపించారు. మరోవైపు రిలయన్స్ సాంకేతిక అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. పైపులైన్లలో ఉన్న గ్యాస్‌ను గాలిలోకి వదిలేయడంతో మద్దికుంటలో మంటల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికి ఉదయం 9 గంటల వరకూ మంటలు ఎగసిపడ్డాయి. ముంబై నుంచి వచ్చే సాంకేతిక బృందం దీనిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను వెలికితీయనున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో జనావాసాల సమీపంలో ఉన్న ఈ మెయిన్ లెవెల్ వాల్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అధికారులకు మొరపెట్టుకున్నారు.