రిషబ్ పంత్ అంటే నేనే: సురేశ్ రైనా

 
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ తాను మెచ్చిన ఆటగాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. పంత్ చాలా బాగా ఆడుతున్నాడని, క్రికెట్‌లోకి వచ్చిన మొదట్లో తాను ఆడినట్టు ఆడుతున్నాడని, అప్పటి తన రోజులను ఇప్పుడు పంత్ గుర్తు చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 620 పరుగులు చేసిన పంత్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పంత్ బ్యాటింగ్ గురించి రైనా మాట్లాడుతూ భారత్ తరపున పంత్ సుదీర్ఘ కాలం ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో పంత్ పలుమార్లు ఆరెంజ్ క్యాప్ ధరించాడు. గతవారం హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు చేశాడు.
రైనా, యువరాజ్ సింగ్‌ల కలయికే రిషబ్ పంత్ అని సచిన్ ఎప్పుడో ప్రశంసించాడని, సెహ్వాగ్ కూడా అతడి ఆటతీరును ఎంతగానో కొనియాడాడని రైనా గుర్తు చేశాడు. తన పదేళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని. భగవంతుడి దయ వల్ల దొరికిన ఇటువంటి ఆటగాళ్లకు మరింత మద్దతు అవసరమని రైనా పేర్కొన్నాడు.