రుణ ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్‌

మాల్యా బాటలో నీరవ్‌ మోడీ

లండన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నాలు

లండన్‌,జూన్‌ 11(జనంసాక్షి):భారత్‌లోబ్యాంకులను ముంచిన ఎగవేతదారులకు లండన్‌ స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి రప్పించేందుకు అంత ఈజీ కాకపోవడంతో తప్పించుకుంటున్నవారు లండన్‌ చేరుతున్నారు. ఇప్పటికే బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న కింగ్‌ఫిషర్‌ విజయ్‌ మాల్యా లండన్‌లోనే ఉండగా, తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేలకోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ కూడా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు. ఆయన అక్కడే రాజకీయ ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌, బ్రిటిష్‌ అధికారులను ఉటంకిస్తూ ఓ విూడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆయనను రప్పింయచేందుకు అధికారులు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగా ఆయన మాత్రం అక్కడే తలదాచుకునేలా ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు బ్రిటన్‌ ¬ంశాఖ అధికారులు నిరాకరించారు. వ్యక్తిగత కేసుల్లో సమాచారం పంచుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు విూడియాలో వచ్చిన వార్తలపై నీరవ్‌మోదీ కూడా స్పందించలేదు. భారత్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన పీఎన్‌బీలో నీరవ్‌మోదీ, అతని మామ మెహుల్‌ చోక్సీలు కలిసి రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మోసం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్‌.. లండన్‌లో ఉంటూ అక్కడ పొలిటికల్‌ ప్రాసిక్యూషన్‌ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులను వేలకోట్లకు మోసగించి ఇలా బ్రిటన్‌ పారిపోయిన వ్యక్తుల్లో మోదీ రెండోవాడు. ఇప్పటికే విజయ్‌మాల్యా లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పీఎన్‌బీ కేసులో నీరవ్‌, చోక్సీలతో కలిపి 25 మందిపై మే నెలలో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.