రూ. 20 లక్షలతో వర్శిటీలో నవీకరణ పనులు
– రిజిస్ట్రార్ కృష్ణమోహన్
శ్రీకాకుళం, జూన్ 28 : యూనివర్శిటీలో రూ. 20 లక్షల వ్యయంతో నవీకరణ పనులు జరుగుతున్నాయని రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ తెలిపారు. వర్శిటీలో తరగతులు ప్రారంభం నాటికి పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్శిటీలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన కుర్చీలు, బోర్డుల ఏర్పాటుతోపాటు ప్రయోగశాలలను, వసతి గృహాన్ని ఇన్‌ఛార్జి ఉపకులపతి అనుమతితో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటీలో కొత్తగా బాధ్యతలు అప్పగించిన ప్రిన్సిపల్, సీడీసీ డీన్, కో-ఆర్డినేటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్యులకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి అవసరమైన పరిపాలన సౌకర్యాలు కల్పించామన్నారు. యూనివర్శిటీలో సిబ్బంది పనితీరు, పారదర్శకత పెంచేందుకు ఉపకులపతి, రిజిస్ట్రార్ ఛాంబర్‌ను సీసీ కెమేరాలతో పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో అన్ని తరగతులకు ఈ ఏర్పాట్లు చేస్తామన్నారు. దీని వల్ల అన్ని విధాలా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రిన్సిపల్ మిర్యాల చంద్రయ్య, కో-ఆర్డినేటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెద్దకోట చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.