రూ.500ల కే స్మార్ట్ ఫోన్..

5దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. దేశంలో బాగా విస్తరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ల విపణిలో ‘రింగింగ్‌ బెల్స్‌’ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ రానుందని వినియోగదారులు ఆనందపడుతున్నప్పటికీ.. ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ‘సమాజంలో అట్టడుగు వర్గం ప్రజలకు కూడా భారత వృద్ధి చేరేలా కృషి చేయాలి’ అన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకు దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నోయిడా కేంద్రంగా పని చేస్తున్న ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ ‘ఫ్రీడమ్‌ 251’ పేరుతో దీనిని మార్కెట్లోకి తేనున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి మనోహర్‌ ఫారికర్‌ చేతుల మీదుగా ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ (17న) బుధవారం ఆవిష్కరించనుంది.
ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ‘డాటా విండ్‌’ సంస్థ ఇటీవలే అనిల్‌ అంబానీ సంస్థ ఆర్‌కామ్‌తో కలిసి రూ.999కే మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫోన్‌ ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉండగానే.. రూ.500ల కంటే కూడా తక్కువకు ‘రింగింగ్‌బెల్స్‌’ చౌక స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుండడం విశేషం. కొత్త ఫోన్‌ విశేషాలేమీ సంస్థ వెల్లడించలేదు. మేటి స్మార్ట్‌ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మార్కెట్లోకి ఏడాది క్రితమే కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.