రెండురోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం

` స్పష్టం చేసిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
` ఐదు రోజూ కొనసాగుతున్న సహాయకచర్యలు
` టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు
మహబూబ్‌నగర్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగమార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు .. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్‌ నిర్మించే నిపుణులు, ఎక్కడ టన్నెల్‌ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకొచ్చి వారి సాయం తీసుకుంటు న్నామని తెలిపారు. ‘సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాం. గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించాం. ప్రకృతి విపత్తునును రాజకీయం చేసి లబ్దిపొందాలనుకునే వారి గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. దేశ.. విదేశాల్లో ఉన్న టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ముందుకెళ్తున్నాం. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే మా లక్ష్యం అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.
ఐదు రోజూ కొనసాగుతున్న సహాయకచర్యలు
టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వందమందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రెస్క్యూ సిబ్బందికి టీబీఎం చాలెంజింగ్‌గా మారింది. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓవైపు బురద, ఇంకోవైపు సీపేజ్‌ వాటర్‌, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్‌ కట్టర్లను ఉపయోగించి తీసేసే ప్రక్రియను జరపాలన్నా.. ఉబికి వస్తున్న నీరు ప్రతిబంధకంగా మారింది. ఇక రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ నేవీ పాలుపంచుకుంటున్నాయి. జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, సింగరేణి, హైడ్రా టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ మరికొన్ని కంపెనీలు తమ సేవలను అందిస్తున్నాయి. మొత్తం 11 ఏజెన్సీలు నిరంతరం కోఆర్డినేషన్‌ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతోన్న సహాయక చర్యలుశ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సవిూక్ష చేస్తూ..సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో సుమారు 7 నుంచి 9 విూటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 విూటర్లలో నీరు ప్రవహిస్తోంది. పూడుకున్న మట్టి తీస్తే తప్ప టీబీఎం ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు బుధవారం ఆపరేషన్‌ మార్కోస్‌ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం… ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్‌ మెరైన్‌ కమాండో ఫోర్స్‌ రంగంలోకి దిగనుంది. దీని సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు. మార్కోస్‌తో బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌వో) భాగస్వామ్యం పంచుకోనుంది.