రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 8 మందికి గాయాలు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని కామినేని వై జంక్షన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా నరసరాపురం డిపోకు చెందిన ఆర్టీసీ ఇంద్రా బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా, ఖమ్మం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మణుగూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా నార్కట్‌పల్లి శివారులోని కామినేని వై జంక్షన్‌ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నరసరాపురం డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌, మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో దాదాపు 43 మంది ప్రయాణికులు ఉన్నారు.