కర్నూలు(జనం సాక్షి ): రెండు జాతీయ పార్టీలు మోసం చేశాయని, భాజపా నమ్మక ద్రోహం చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. ఆదివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. కర్నూలు జిల్లాలో 68 చెరువులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఓర్వకల్లుకు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ వచ్చిందన్నారు. జొన్నగిరిలో 80శాతం మేర సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. అర్హులైన వారికే పింఛన్లు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలిచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 75యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని వివరించారు.
సోమవారం.. పోలవారంగా మార్చుకున్నాం నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పంట సంజీవని కింద 7.25లక్షల పంటకుంటలను తవ్వామన్నారు. సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నామని చెప్పారు. ఉపాధి హామీ, జలవనరుల శాఖలు సమర్థంగా పని చేస్తున్నాయని కితాబు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.52వేల కోట్ల ఖర్చుపెట్టామన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీచ్చారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి రాయలసీమకు 150 టీఎంసీల నీళ్లిచ్చామన్నారు. గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని వ్యాఖ్యానించారు. ఎవరు అడ్డు వచ్చినా.. పోలవరం ఆగదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడితే ఆంధ్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు. నిధులు ఇస్తే 2019 డిసెంబరులోపు పోలవరం ప్రాజక్ట్‌ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 55 శాతం మేర పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు 20వేలమంది ప్రాజెక్ట్‌ను సందర్శించారని తెలిపారు.
త్వరలో అన్న క్యాంటీన్లు పట్టణాల్లో 200 చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం, మోదీపై పోరాడాలని సూచించారు. వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో తెదేపా గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుట్ర రాజకీయాలను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. వైకాపా నేతలు నవనిర్మాణ దీక్ష రోజున వంచన దీక్ష చేపట్టారని విమర్శించారు. ఇసుక విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ సారి కేంద్రంలో భాజపా అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయన్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన అంశాల సాధన కోసం ఆశీస్సులు కావాలని ప్రజలను కోరారు. అనంతరం నీటి సంరక్షణపై ముఖ్యమంత్రి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.